13, సెప్టెంబర్ 2012, గురువారం

ఓ కుశాలైన కొట్లాట

మొన్నామధ్య బస్సులో  శీశైలం నుంచి హైదరాబాదు పోతుంటే ఓ కుశాలైన కొట్లాట జరిగిందబ్బా . కొట్లాటంటే  తన్నుకున్నది, చొక్కాలు చిన్చుకున్నది కాదు గాని డైలాగులు మాత్రం చించి ఆరేశారు. అసలేమయిందంటే  నేనెక్కి కూసున్న ఆర్టీసీ బస్సు  శీశైలం దాటి సున్నిపెంట కాడికి వచ్చింది . అప్పుడికే  ఆడ శానా మంది  ఈ బస్సుకోసమని నిలబడున్నారు. బస్సు ఆడికొచ్చిందో లేదో  ఆడున్న ఆడా మగా జనమంతా బస్సుమీడికి కమరబడే. కొంతమంది ఉశారైన మొగోల్లయితే వాళ్ళ  పెళ్ళాం పిల్లల్ని ఆడే ఉంచి  బస్సు  కిటికీలపై ఎగబాకినారు .సదువు లేనోల్లైతే పై నున్న  తువాళ్ళు ,  సదువుకున్నోలైతే జోబిలోని  కచ్చీపులు కాలీగున్న సీట్లల్లో పడేసి అమ్మయ్య  ఎట్టగైతేనేమి సీటు  దొరికిన్చుకున్నములే అని కూసింత ఊపిరి పీల్చుకున్నారు.ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటే దిగేవాళ్ళు దిగుతుండే. అంతవరకు బాగానే ఉండాదబ్బా . అప్పుడ్నుంచే అసలు సినమా మెదలైనాది. ఒక సదువుకున్నాయన  పెళ్ళాం కోసమని  ఒక సీట్లో కచ్చీపు ఏసినాడు . అదే సీట్లో ఏరే ఒక సదువుకున్నయానా వాళ్ళ పెళ్ళాం మరదలు కోసమని కచ్చీపు ఏసినాడు .నేను ఆ సీటు యెనకనే ఉన్నాను  అయితే  ఫస్టు  ఎవరు  కచ్చీపు ఏసినారో  దేవుడి సాచ్చిగా  నాక్కూడా తెలియదబ్బా . ఇప్పుడేమయిందంటే ఫస్టు  కచ్చీపు ఎసినాయన ఆయన పెళ్లంతోపాటు వచ్చి కూసున్నాడు . అంతలోకే రెండో కచ్చీపు ఏసినాయన వాళ్ళ పెళ్ళాం మరదలిని తీసుకుని నేరుగా అదే సీటు దగ్గరికి వాచినాడబ్బా. రెండో మనిసి పెళ్ళాం మరదలు ఆ సీట్లో ఉన్నవాళ్ళను లెయ్యమని తగులుకున్నారు . మేము ముందు కచ్చీపు ఏసినామని వాళ్ళు తగులుకున్నారు. మొగోళ్ళు మొగోళ్ళు బాగానే ఉన్నరుగాని ఆడోల్ల గొంతులే అంతకంతకు పెరిగిపోయి కాకిగోలైపోయింది . ఎవురేం మాట్లాడుతున్నారో  అర్తంకావటం లేదుగాని  తుపాను తీరం దాటే  లెవల్లో వుండాదని మాత్రం నాకు అర్థమవుత వుండాది . సీట్లో కూచున్న మొగమనిసికి రోసమొచ్చి ఆడోల్ల పైకి కొట్టేమోయిన లేచాడు. వాళ్ళు ఊరుకుంటారా సాముల్లారా గొంతులు ఇంకాస్త పెంచేసినారు   . మేము ఆడోల్లం మమ్మల్నే కొట్టటానికి వస్తావా సీటేమన్నా మీ తాత సొమ్మా  అని ఇంకా రెచ్చిపోయే . అవతలున్న మగోనికి  ఓపిక  సచ్చినట్టున్నది  "గొందురు కప్పల్లా అంత నోరేసుకొని అరుస్తున్డారు మీరు ఆడోల్లా, ఛ ! ఆడ జాతికే అవమానం అంటూ పెళ్ళాన్ని తీసుకుని సక్కా బస్సు దిగిపోయిండు .ఆ డయిలాగిన్న నేను నవ్వాపుకోలేక  కిసుక్కున నవ్వితిని .ఆ మాటలు బడ్డ ఆడామె నాపై గుడ్లురిమే . చచ్చాన్రో దేవుడా ఇప్పడు నా మీద కమరబడతదేమోనని నాకు బిత్తరబుట్టే. ఆ మల్లన్నను తలచుకుంటూ తల ఆవైపుకు తిప్పుకున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి